సింగరేణిలో కొలువుల జాతర



సింగరేణిలో కొలువుల జాతర

-5,472 పోస్టుల భర్తీకి ఏర్పాట్లు
-ఇంటర్వ్యూల పద్ధతి రద్దు..
-రాతపరీక్షలో మెరిట్ ఆధారంగానే ఉద్యోగాలు
-ఇంటర్నల్ పోస్టులు 564
-ఎక్స్‌టర్నల్‌పోస్టులు 2,164
-డిపెండెంట్లు 2,744


singareni

నమస్తే తెలంగాణ, హైదరాబాద్:వందేండ్ల సింగరేణి చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఒకేసారి 5,472 పోస్టులు భర్తీ చేయాలని సంస్థ యాజమాన్యం నిర్ణయించింది. రాతపరీక్ష ద్వారా 2,164 పోస్టుల భర్తీకి సంబంధించి ఈ నెల 10వ తేదీన తొలి నోటిఫికేషన్ జారీకానుంది. ఇందులో ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, మైనింగ్ విభాగాలకు సంబంధించిన 1,127 పోస్టులు డిప్లొమా, డిగ్రీ విద్యార్హతలకు సంబంధించినవే కావడం గమనార్హం. మార్చి 3వ తేదీన ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, మైన్ సర్వేయర్, జూనియర్ అసిస్టెంట్స్ విభాగాల్లో 771 పోస్టులకు రెండవ నోటిఫికేషన్ వెలువడుతుంది.


తదుపరి మార్చి 31న పారామెడికల్, ఇతర సాంకేతిక సిబ్బందికి సంబంధించి 266 పోస్టులకు మూడవ నోటిఫికేషన్ జారీచేస్తారు. సుదీర్ఘ ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ ఈ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. సీమాంధ్ర పాలనలో నిర్లక్ష్యానికి, నిరాదరణకు గురైన సింగరేణి సంస్థను వ్యాపార, వాణిజ్య ప్రక్రియలో ముందుంచేందుకు మరో 17 కొత్త మైనింగ్‌లను చేపట్టే లక్ష్యంతోపాటు సింగరేణి సిరులను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళాలన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆకాంక్షకు అనుగుణంగా సింగరేణి
యాజమాన్యం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నది.

list1


ఇప్పటి వరకు ఏటా రెండు శాతం, మూడు శాతం పెరుగుదలకే పరిమితమైన సింగరేణి సంస్థ వచ్చే ఏడాది (2015-16)నుంచి 10శాతం చొప్పున పెరుగుదల(గ్రోత్)ను లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా తొలుత సంస్థాగతంగా మానవవనరుల(ఉద్యోగాలు) సమీకరణ దిశగా యాజమాన్యం ముందడుగు వేసింది. తెలంగాణ రాష్ట్రం తొలి ఏడాది సంబరాలనాటికి సింగరేణి కొలువుల జాతర ముగించాలన్న దృఢసంకల్పంతో సీఎండీ ఉండడం విశేషం. సింగరేణిలో డిపెండెంట్లు 2004 సంవత్సరంనుంచి ఉద్యోగాలకోసం ఎదురుచూపులు చూస్తున్నారు. గత దశాబ్దకాలంగా వారిగోడును ప్రభుత్వాలు పట్టించుకున్న పాపాన పోలేదు.

దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు లెక్కలు తీసిన యాజమాన్యం.. 2004 మార్చి వరకు 2,744 మంది డిపెండెంట్లు వెయిటింగ్‌లో ఉన్నట్లు నిర్ధారించింది. వీటిల్లో 753 మందికి ఇప్పటి వరకు ఉద్యోగాలు కల్పించగా.. మిగతా 1,991 మంది డిపెండెంట్లకు వచ్చే ఆగస్టునాటికి ఉద్యోగాలివ్వాలని నిర్ణయించింది. ఇదిలా ఉండగా, ఇప్పటి వరకు సింగరేణిలో పదోన్నతులకు నోచుకోని 564 మంది ఉద్యోగులకు తక్షణమే పదోన్నతులు కల్పించనున్నారు. వివిద హోదా(కేడర్)ల్లో పనిచేస్తున్న ఉద్యోగుల జాబితాలను సిద్ధంచేశారు. వారికి పదోన్నతులు కల్పించడం ద్వారా ఖాళీ అయిన పోస్టులను వెంటనే భర్తీ చేయనున్నారు.

నోటిఫికేషన్ ప్రక్రియద్వారా భర్తీ చేయతలపెట్టిన 2,164 డైరెక్టు రిక్రూట్‌మెంట్ పోస్టులను రాష్ట్రపతి ఉత్తర్వులకు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ల(ఆర్వోర్)కు లోబడి పారదర్శకంగా భర్తీ చేయనున్నారు. అవినీతికి, సిఫార్సులకు ఏమాత్రం ఆస్కారంలేకుండా రాతపరీక్షలో ప్రతిభ (మెరిట్) ఆధారంగానే నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న కృతనిశ్చయంతో సింగరేణి ఉంది. ఇందుకోసం రాతపరీక్ష తర్వాత ఇంటర్వూల పద్ధతికి స్వస్తి పలికింది. అంతేకాకుండా ఇప్పటివరకు ఉన్న సింగరేణి రిక్రూట్‌మెంట్ విభాగాన్ని ప్రక్షాళన చేసింది. రిక్రూట్‌మెంట్ ప్రక్రియ వేగవంతం చేసేందుకు అనువుగా నిబద్ధత కలిగిన 50 మంది అధికారులు, సిబ్బందిని అదనంగా ఈ విభాగంలో పనిచేసే అవకాశాన్ని కల్పించింది.

Followers